తెల్లవారే మసక చీకట్లను చీల్చుకుంటూ లేచే కోట్లాది మంది జీవన ప్రయాణం ఒక వేడివేడి టీ కప్పుతోనే మొదలవుతుంది. శ్రమజీవికి అది అలసటను తీర్చే అమృతం, ఆలోచనాపరుడికి మనసును ఉత్తేజపరిచే ఉత్ప్రేరకం. అయితే పింగాణీ కప్పుల అంచుల్లో ఆవిర్లు కక్కే ఈ సుగంధ భరిత పానీయం వెనుక సామ్రాజ్యవాదుల కుట్రలు, శ్రామికుల నడ్డి విరిచిన వెట్టిచాకిరీ, తరతరాల ఆదివాసీల రక్తసిక్త చరిత్ర దాగి ఉన్నాయి.
తేనీటికి పూర్వం: ప్రాచీన భారతీయుల పానీయ సంస్కృతి
బ్రిటీషర్లు ‘ టీ ‘ని ప్రవేశపెట్టకముందు భారతీయ జీవనశైలి ప్రకృతితో, ఆయుర్వేద మూలాలతో పెనవేసుకుని ఉండేది. ఉదయాన్నే శరీరాన్ని చల్లబరిచేందుకు, జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు అంబలి, గంజి, రాగి జావ, తాజా మజ్జిగ తాగడం ఆచారంగా ఉండేది. అలసటను దూరం చేసేందుకు కొబ్బరినీళ్లు, తాటికల్లు; బెల్లం, మిరియాలు కలిపిన పానకం, అల్లం-తులసి కషాయాలను సేవించేవారు. సంపన్నులు, రాజవంశీకులు కుంకుమపువ్వు, బాదం, యాలకులతో కూడిన వేడి పాలును తీసుకునేవారు. శరీరాన్ని ఉత్తేజపరచడానికి, రోగాలను నివారించడానికి ఆయుర్వేద మూలికా కషాయాలే అప్పటి నిత్య పానీయాలు.
అడవి ఆకుల నుంచి సామ్రాజ్య వ్యూహం దాకా..
అస్సాంలోని సింగ్ఫో, ఖామ్తీ తెగల ప్రజలు శతాబ్దాలుగా అడవి తేయాకును ఔషధ కషాయంగా ‘ఫలప్’ పేరుతో తాగేవారు. 1823లో రాబర్ట్ బ్రూస్ అనే స్కాటిష్ సైనికుడు ఈ అడవి మొక్కను గుర్తించడంతో చరిత్ర మలుపు తిరిగింది. చైనాతో నెలకొన్న నల్లమందు యుద్ధాలు, వాణిజ్య వివాదాల నేపథ్యంలో చైనా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ భారత్‌లోనే తేయాకు సాగుకు పూనుకుంది. అస్సాం, డార్జిలింగ్ కొండల్లో వాణిజ్య తోటలను ప్రారంభించింది. మొదట్లో భారతీయులు ఎవరూ టీ తాగేవారు కాదు; పండినదంతా లండన్‌కే ఎగుమతి అయ్యేది. 1900ల నాటి ఆర్థిక మాంద్యం వల్ల నిల్వలు పేరుకుపోవడంతో, భారతీయులకు టీ అలవాటు చేసేందుకు బ్రిటీష్ ఇండియన్ టీ అసోసియేషన్ నడుం బిగించింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ఉచితంగా వేడివేడి టీని పంపిణీ చేశారు. యూరోపియన్ చేదు బ్లాక్ టీని భారతీయుల నాలుకకు నచ్చేలా మరిగించిన పాలు, చక్కెర, అల్లం, యాలకులతో కలిపి ‘మసాలా చాయ్’గా మార్చి కర్మాగారాలు, వంటిళ్లలోకి చొప్పించారు.
కొండ లోయల కన్నీరు: అస్సాం నుంచి నీలగిరి దాకా దురాగతాలు
ఈ ఘుమఘుమల మాటున లక్షలాది మంది కార్మికుల నెత్తుటి గాథలున్నాయి. అస్సాం తోటల కోసం బిహార్, ఒడిశా, జార్ఖండ్ గిరిజనులను మోసపూరిత ఒప్పందాలతో తరలించి, నల్ల చట్టాలతో బానిసలుగా బంధించారు. తప్పించుకోవాలని చూస్తే కొరడా దెబ్బలు తప్పేవి కావు. మరోవైపు పశ్చిమ కనుమలు, ముఖ్యంగా తమిళనాడులోని నీలగిరి, అన్నామలై కొండల్లో తెల్లదొరల దోపిడీ పరాకాష్టకు చేరింది. 1876–78 నాటి భయంకరమైన ‘ధాతు కరువు’ను ఆసరాగా చేసుకుని, ఆకలితో అలమటించిన తమిళ మైదాన ప్రాంత ప్రజలను ‘కంకాని’ దళారీ వ్యవస్థ ద్వారా నీలగిరి కొండలకు తరలించి అప్పుల ఊబిలో వెట్టిచాకిరీ చేయించేవారు. స్థానిక తోడ, బడగ, కోట ఆదివాసీల సాంప్రదాయ అడవులను, పచ్చిక బయళ్లను బలవంతంగా లాక్కుని ఎస్టేట్లుగా మార్చారు. తీవ్రమైన చలి, వర్షాలు, మలేరియా, కలరా, జలగల కాట్లతో వేలాది మంది శ్రామికులు ఆ కంచెల నడుమే సమాధులయ్యారు.
టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రస్థానం
స్వాతంత్రం తరువాత 1953 టీ చట్టం కింద ఏర్పాటైన టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతీయ తేయాకు రకాలకు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) భద్రత కల్పిస్తూ, చిన్నకారు రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. నేడు భారత్ ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో రెండో స్థానంలో, వినియోగంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 5.7 లక్షల నుంచి 6 లక్షల హెక్టార్లలో సాగు విస్తరించి ఉంది. ఈశాన్య భారతంలో అస్సాం దేశ ఉత్పత్తిలో సగానికి పైగా వాటాతో అగ్రగామిగా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, డూర్స్ ప్రాంతాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతంలో నీలగిరి, మున్నార్, వయనాడ్ కొండలతో పాటు ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయ ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.
సాంప్రదాయ పద్ధతులను దాటి ఆధునిక పోకడలను అందిపుచ్చుకునే క్రమంలో, టీ బోర్డు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నూతన ఉత్పత్తులను ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టింది. యువత కోసం రెడీ-టు-డ్రింక్ కోల్డ్ టీలు, ఇన్స్టంట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక్ గ్రీన్ టీలు, అశ్వగంధ-తులసి బ్లెండ్స్, ఖరీదైన వైట్ ,ఊలాంగ్ టీలను టీ బోర్డు ప్రోత్సహిస్తుంది.
ఒకప్పుడు దోపిడీ సంకెళ్ల నడుమ కన్నీటి ధారలతో మొదలైన భారతీయ తేయాకు ప్రస్థానం, నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, సరికొత్త రూపాలతో అంతర్జాతీయ విపణిలో విస్తరిస్తోంది.
