గేటెడ్ భ్రమలు,జల వినియోగంలో మితిమీరిన ఉల్లంఘనలు..వ్యవస్థాగత నేరం, పౌర ఉదాసీనతలపై ఒక సమగ్ర పరిశీలన.
“ఒక మెగా లైఫ్‌స్టైల్..మీరు గడిపే ప్రతి క్షణంలోనూ ఆనందాన్ని అనుభవించే అద్భుత ప్రపంచం”
“ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి ఎన్నో మార్పులకు లోనవుతోంది. మారుతున్న కాలానుగుణంగా విశాఖ కూడా సరికొత్త జీవనశైలికి అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న MVV CITYలో మీకు సాదర ఆహ్వానం. ఇది ఒక మైలురాయిగా నిలిచే అద్భుతమైన ప్రాజెక్ట్…”
ఇది MVV City లో ప్లాట్ల కొనుగోలుదార్లను ఆకర్షించిన ప్రకటన..దీని బ్రాండింగ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఉంది…అసలు విషయానికి వద్దాం!
ఎత్తైన ప్రహరీలు, సెక్యూరిటీ గేట్ల వెనుక విలాసవంతమైన జీవనం.. ‘గేటెడ్ కమ్యూనిటీ’ పేరిట పుట్టుకొచ్చిన ఓ అతిపెద్ద నాగరిక భ్రమ! ఎంత సంపద వెచ్చించినా ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలైన గాలి, నీటిని గేట్లతో బంధించలేమన్న ప్రాథమిక సత్యాన్ని విద్యావంతులు సైతం విస్మరించడం అత్యంత విచారకరం. ఇది కేవలం ‘ఎంవీవీ సిటీ’ నివాసితుల సమస్య మాత్రమే కాదు; నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న గేటెడ్ సంస్కృతి అంతర్లీనంగా మోసుకొస్తున్న పెను ముప్పునకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆ దాహార్తి లోతుపాతులను అందరూ గ్రహించాలనే ఉద్దేశంతోనే ఈ వాస్తవాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
వైజాగ్ మధురవాడ పీఎం పాలెం స్టేడియం ఎదురుగా.. 10 ఎకరాల విస్తీర్ణంలో, 12 టవర్లు, 15 అంతస్తులతో నిర్మించిన 1,428 విలాసవంతమైన ఫ్లాట్లలో కోట్లు కుమ్మరించిన దాదాపు 1,200 కుటుంబాలు (సుమారు 5,000 మంది నివాసితులు) నేడు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఒక్కో ఫ్లాట్‌పై రూ. 75 లక్షల నుండి రూ. 1.50 కోట్ల వరకు వెచ్చించిన ఉన్నత శ్రేణి పౌరులు, నేడు సోషల్ మీడియా రీల్స్‌లో ‘వి వాంట్ వాటర్’ అంటూ నినదించాల్సి రావడం దయనీయం. నిజానికి ఇది ప్రకృతి విపత్తు కాదు; రాజకీయ-వ్యాపార దాహం, అధికార యంత్రాంగ నిర్లక్ష్యం, కొనుగోలుదారుల ఉదాసీనత కలగలిసి సృష్టించిన క్షమించరాని ‘వ్యవస్థాగత నేరం’.
డెవలపర్ వ్యాపార దాహం: రాజకీయ పలుకుబడితో సాగిన అక్రమాలు
సాధారణ బిల్డర్‌గా మొదలై వైజాగ్ ఎంపీగా చక్రం తిప్పిన ఎంవీవీ సత్యనారాయణ ప్రాజెక్టును పరిశీలిస్తే.. రాజకీయ అధికారం, వ్యాపార ప్రయోజనాలు ఏకమైతే చట్టాలు ఎలా నిర్వీర్యమవుతాయో స్పష్టమవుతుంది. దశాబ్దం క్రితమే సమీప లేఅవుట్‌లోని ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లు, రోడ్లు, కాలువలను ఆక్రమించి ప్రాజెక్ట్ ప్రధాన రహదారిగా మార్చుకున్నారన్న ఆరోపణలతో పీఎం పాలెం పోలీసులు డెవలపర్‌పై ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, ఐపీసీ సెక్షన్లు (447, 427, 120B) కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితులను బెదిరించిన ఉదంతాలూ వెలుగుచూశాయి.
రాజకీయ పలుకుబడితో అడ్డంకులన్నింటినీ తొలగించుకుని, ‘24 గంటల నిరంతర నీటి సరఫరా’ అంటూ తప్పుడు ప్రచారాలతో సుమారు రూ. 968.10 కోట్ల స్థూల వ్యాపారం సాగించారు. భూమి, నిర్మాణం, అనుమతులు, మార్కెటింగ్ ఖర్చులు కలిపి రూ. 570.19 కోట్లు కాగా, డెవలపర్ ఏకంగా రూ. 397.91 కోట్ల నికర లాభాన్ని (41.1% మార్జిన్) ఆర్జించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, 5,000 మంది నివాసితుల తాగునీటి కోసం జీవీఎంసీ ప్రధాన పైప్‌లైన్ అనుసంధానానికి అవసరమైన రూ. 5 నుండి రూ. 10 కోట్లను సైతం వెచ్చించకుండా, ప్రజలను ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా దయాదాక్షిణ్యాలపై వదిలేసి చేతులు దులుపుకున్నారు.
ప్రభుత్వ శాఖల సమష్టి వైఫల్యం
వీఎంఆర్‌డీఏ (VMRDA) & టౌన్ ప్లానింగ్: మధురవాడ భౌగోళికంగా గట్టి రాతి నేల (Hard Rock Aquifer). అక్కడ 5,000 మంది రోజువారీ నీటి అవసరాలను (7 నుండి 8 లక్షల లీటర్లు) తీర్చే సహజ జలవనరులు ఉన్నాయా లేదా అన్న క్యారీయింగ్ కెపాసిటీ ఆడిట్ (Carrying Capacity Audit) నిర్వహించకుండానే 15 అంతస్తుల నిర్మాణానికి గుడ్డిగా పచ్చజెండా ఊపాయి.
జీవీఎంసీ (GVMC): క్షేత్రస్థాయిలో శాశ్వత తాగునీటి పైప్‌లైన్, సరైన డ్రైనేజీ అనుసంధానం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC) జారీ చేసింది. పన్నుల వసూలుపై చూపిన శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో చూపలేదు. సంక్షోభం ముదిరిన తర్వాత రోజుకు అరకొరగా 4 నుండి 8 ట్యాంకర్ల నీటిని పంపి మమ అనిపించింది.
భూగర్భ జల విభాగం: ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా 15 నుండి 20 బోర్లు వేసి, 700 నుండి 800 అడుగుల లోతుకు భూమిని తొలచి జలవనరులను కొల్లగొడుతుంటే చోద్యం చూసింది. ఈ విచక్షణారహిత తవ్వకాల వల్ల పరిసర కాలనీల భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోయాయి. చుట్టుపక్కల ప్రజలకు జరిగిన ఈ శాశ్వత పర్యావరణ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఏపీపీసీబీ (APPCB) & SEIAA: లక్ష చదరపు మీటర్ల పైబడిన ఈ భారీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (EC) మంజూరు చేసి, ఆ తర్వాత వాటర్ బ్యాలెన్స్ నిబంధనల పర్యవేక్షణను గాలికొదిలేశాయి. ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన నివేదికలు ఇవ్వనందుకు 2019లో నామమాత్రపు నోటీసులిచ్చి, క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకుండా ఫైళ్లకే పరిమితమయ్యాయి.
ఏపీ రెరా (AP RERA): బ్రోచర్లలో పేర్కొన్న నిరంతర తాగునీటి వాగ్దానాల అమలును ఏమాత్రం పర్యవేక్షించలేదు. ఎస్క్రో (Escrow) ఖాతాల ద్వారా మౌలిక వసతుల పనులను అనుసంధానించడంలోనూ, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డా సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలోనూ పూర్తిగా విఫలమైంది.
చట్టాల ఉల్లంఘనలు
వాల్టా చట్టం (WALTA 2002): ముందస్తు హైడ్రోలాజికల్ అనుమతులు లేకుండా కొండ ప్రాంతంలో 800 అడుగుల లోతుకు బోర్లు వేయడం, బోర్ల మధ్య కనీస దూరం పాటించకపోవడం, వర్షపు నీటి రీఛార్జ్ పిట్లు నిర్మించకపోవడం బహిరంగ చట్ట ఉల్లంఘనలే.
EIA 2006 & పర్యావరణ అనుమతులు (EC): మున్సిపల్ సరఫరా నీటినే వాడతామని, ఎస్టీపీ (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని రీసైకిల్ చేస్తామని సమర్పించిన వాటర్ బ్యాలెన్స్ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పూర్తిగా తుంగలో తొక్కారు.
కంప్లయన్స్ నివేదికల (ECCR) ఎగవేత: పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 సెక్షన్ 20 ప్రకారం ప్రాజెక్ట్ యాజమాన్యం సమర్పించాల్సిన పోస్ట్-ఈసీ నివేదికలను దాటవేస్తున్నా నియంత్రణ సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి.
మున్సిపల్ చట్టాలు & రెరా (RERA 2016): తాగునీరు, మురుగునీటి వసతులు లేకుండానే తప్పుడు ధ్రువీకరణలతో నివాస యోగ్యతా పత్రాలు (OC) జారీ చేయడం తీవ్ర అధికార దుర్వినియోగం. బ్రోచర్లలో ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించి ప్రాజెక్ట్ అప్పగించడం రెరా నిబంధనల నేరపూరిత ఉల్లంఘన.
కొనుగోలుదారుల బాధ్యతారాహిత్యం
ఈ సంక్షోభంలో కొనుగోలుదారుల ఆలోచనా రాహిత్యం కూడా అంతే విచారకరం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు.. ఇలా సమాజంలో అత్యున్నత విద్యావంతులు, నిపుణులైన వీరు ఇల్లు కొనేటప్పుడు మాత్రం కనీస విచక్షణను విస్మరించి బాహ్య ఆడంబరాల మోజులో పడ్డారు.
ఈస్ట్ ఫేసింగ్, నార్త్-ఈస్ట్ ఫేసింగ్, 5 అంతస్తుల క్లబ్‌హౌస్, రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక జిమ్‌లు చూసి మురిసిపోయారే తప్ప.. 12 టవర్ల దాహం తీర్చే శాశ్వత నీటి వనరు ఎక్కడుందన్న ప్రాథమిక ప్రశ్నను వేయలేకపోయారు. జీవీఎంసీ అధికారిక పైప్‌లైన్ మంజూరైందా? ఓసీ నిబంధనలు పూర్తయ్యాయా? బోరు బావుల సామర్థ్యమెంత? భూగర్భ జలాల లభ్యత ఎంత? అన్న కనీస విషయాలను ఆరా తీయలేదు. ప్రాజెక్ట్ ప్రారంభంలోనే బోర్లు అడుగంటుతున్నా సమష్టిగా చట్టపరమైన పోరాటం చేయకుండా, చివరకు ‘We want water’ అంటూ నినదించే దుస్థితి వచ్చేవరకు మిన్నకుండిపోవడం వారి పౌర ఉదాసీనతకు నిదర్శనం.
నీరు వ్యాపార సరుకు కాదు; అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే ప్రాథమిక హక్కు. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల వైపు ఆకర్షితులయ్యే వారు ఇప్పటికైనా మేల్కొనాలి. తాము నివసిస్తున్న చోట చట్టాల ఉల్లంఘనలను ముందే గమనించండి; న్యాయపరంగా భవిష్యత్తులో వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే సమష్టిగా ఆలోచించండి!
