✍️ Srinivas Ganjivarapu

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా సరదా వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకునేందుకు సామాన్యులు, ప్రత్యేకించి యువతరం ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాలను ప్రధాన వేదికలుగా ఎంచుకుంటున్నారు. సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ ప్రచార వ్యవస్థ ఇప్పుడు నేరుగా అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌లపైకి చేరింది. ఈ నేపథ్యంలో యువతను సోషల్ మీడియా ద్వారా ప్రభావవంతంగా చేరుకోవాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఒక కీలక విధాన నిర్ణయాన్ని ఆమోదించింది. అదే ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’.

కేబినెట్ నిర్ణయం – నాలుగు శ్రేణుల వర్గీకరణ

ఈ నూతన విధానం కింద సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండే కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి అధికారిక ధ్రువీకరణ కల్పిస్తారు. ఫాలోవర్ల సంఖ్య ప్రాతిపదికగా వారిని నాలుగు విభాగాలుగా విభజించి గౌరవ వేతనం తరహాలో చెల్లింపులు ఖరారు చేశారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి గరిష్ఠంగా రూ. 15 వేలు, 50 వేల నుంచి లక్ష లోపు ఉన్నవారికి రూ. 7,500, 25 వేల నుంచి 50 వేల లోపు ఉంటే రూ. 5 వేలు, 10 వేల నుంచి 25 వేల వరకు ఫాలోవర్లు ఉన్న చిన్న క్రియేటర్లకు రూ. 2,500 వరకు ప్రభుత్వం చెల్లించనుంది. డిజిటల్ సమాచారాన్ని క్షేత్రస్థాయికి వేగంగా చేరవేసే వారధిగా క్రియేటర్లను వాడుకోవడమే సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఐ-ప్యాక్ ఆరోపణలు.. గతానుభవాల నీడ

అయితే ఈ తరహా ప్రచార వ్యూహాల వెనుక గత చేదు అనుభవాలు ఉన్నాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్ (I-PAC) సంస్థ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాలనా వ్యవహారాల్లోనూ నేరుగా భాగస్వామ్యమైందన్న బలమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం ఐ-ప్యాక్ కంపెనీకి ప్రజాధనం నుంచి ఏటా రూ. 68 కోట్ల చొప్పున మొత్తం రూ. 274 కోట్లు దోచిపెట్టిందని 2023లో తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అయితే అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ భారీ ఆరోపణలపై స్పష్టమైన సమీక్ష గానీ, దర్యాప్తు గానీ జరగకపోవడం గమనార్హం. గతంలో ఇతరులపై వేలెత్తి చూపిన అంశాలే నేడు కొత్త రూపాల్లో తెరపైకి వస్తున్నాయా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కూటమిలో ఏజెన్సీల హవా.. పేషీలపై పెత్తనం

వర్తమాన కూటమి ప్రభుత్వంలోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు ఎన్నికల ముందు వేర్వేరు ప్రైవేట్ కన్సల్టెన్సీలు, వ్యూహకర్తలు పనిచేశారు. ఇప్పుడూ ఆయా పార్టీలకు వేర్వేరు ఏజెన్సీలే మార్గనిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయి సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మొదలుకొని మంత్రుల వ్యక్తిగత పేషీల నియామకాలు, విధానపరమైన నిర్ణయాల వరకు ఈ ప్రైవేట్ వ్యూహకర్తల బృందాలే పెత్తనం చెలాయిస్తున్నాయన్న ఆరోపణలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరి నిర్వహణ కోసం వివిధ కార్పొరేషన్లు, సలహాదారుల రూపంలో దొడ్డిదారిన ప్రజాధనాన్ని కేటాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ తీసుకురావడం ప్రజల్లో మరింత గందరగోళానికి దారితీసే ఆస్కారం ఉంది.

జాతీయ, అంతర్జాతీయ నమూనాలు.. పారదర్శకత సవాలు

ఇటువంటి ప్రయోగాలు దేశంలో మొదటిసారేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం MyGov వేదిక ద్వారా కంటెంట్ క్రియేటర్లను భాగస్వామ్యం చేయడంతో పాటు ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’ ప్రవేశపెట్టింది. రాజస్థాన్‌ గత ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ. 5 లక్షల వరకు చెల్లించే పాలసీ తెచ్చి, ఎన్నికల వేళ పార్టీ పీఆర్ కోసమే ప్రజాధనాన్ని వాడుతోందన్న వివాదంలో చిక్కుకుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకున్నప్పటికీ, అది ‘స్పాన్సర్డ్ ప్రకటన’ అని తప్పనిసరిగా స్పష్టం చేయాలనే కఠిన నిబంధనలు ఉన్నాయి. అక్కడ పార్టీ రాజకీయాలకు, ప్రభుత్వ సమాచారానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది.

కూటమి పార్టీల కేడర్‌కు సవాళ్లు

తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా నమ్ముకున్న నిబద్ధత గల సంప్రదాయ కార్యకర్తలు, అభిమాన నెట్‌వర్క్ ఉంది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తూ, ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా గళమెత్తే ఈ కేడర్‌ను విస్మరించి, కేవలం ఫాలోవర్ల సంఖ్య ప్రాతిపదికగా బయటి ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు జరిపితే తీవ్ర అసంతృప్తి రాజుకునే ప్రమాదముంది. నిస్వార్థంగా పనిచేసే సొంత పార్టీ సైబర్ యోధులను కాదని, కేవలం గణాంకాల ప్రాతిపదికన కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూటమి అంతర్గత వర్గాల్లో అసూయ, నైరాశ్యం పెరిగిపోయి సోషల్ మీడియా వేదికలపైనే ఘర్షణలకు దారితీయవచ్చు; అంతిమంగా ప్రభుత్వ ప్రచార లక్ష్యమే పక్కదారి పట్టి అసలుకే ఎసరు వచ్చే ముప్పు పొంచివుంది.

ప్రజా ప్రచారమా… పరోక్ష పీఆర్ సైన్యమా?

ఈ విధానం ద్వారా పేపర్ ప్రకటనల కంటే తక్కువ ఖర్చుతో యువతకు సంక్షేమ పథకాలను చేర్చే అవకాశం ఉన్నప్పటికీ, అసలైన ప్రమాదం అంతర్గతంగానే పొంచి ఉంది. కేవలం ఫాలోవర్ల సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకుంటే డబ్బులిచ్చి నకిలీ బాట్ ఫాలోవర్లను కొనుగోలు చేసే ముఠాలు పుట్టుకొస్తాయి. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ సంక్షేమం ముసుగులో ఆయా పార్టీల ప్రైవేట్ వ్యూహకర్తలు తమ అనుకూల సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ప్రభుత్వ నిధులతో పోషించుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వ చెల్లింపులపై ఆధారపడే క్రియేటర్లు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే స్వేచ్ఛను కోల్పోతారు.

ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రభుత్వ బాధ్యతే అయినా, అది పార్టీల రాజకీయ పీఆర్ ఆర్మీని పెంచే సాధనంగా మారకూడదు. ప్రైవేట్ వ్యూహకర్తల ప్రయోజనాలకు కాకుండా, కేవలం ప్రజారోగ్యం, విద్య, సంక్షేమ పథకాల నిబంధనలకు మాత్రమే ఈ పాలసీ పరిమితం కావాలి. పూర్తి పారదర్శకమైన స్వతంత్ర పర్యవేక్షణ, స్పష్టమైన డిస్‌క్లోజర్ నిబంధనలు ఉన్నప్పుడే ఈ డిజిటల్ ప్రయోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగి, ప్రభుత్వానికి విశ్వసనీయత దక్కుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *