ఇంగువ నాణ్యతపై వినియోగదారుల్లో ఆందోళన
దశాబ్దాల నాటి సంప్రదాయం, తరం మారినా తరగని రుచి, వంటింటి అరల్లో చిరస్థాయిగా తిష్టవేసిన చిన్ని డబ్బా… ఇదీ భారతీయ, ప్రత్యేకించి దక్షిణాది లోగిళ్లలో ఇంగువకు ఉన్న తిరుగులేని ఆదరణ. వేడి నూనెలో చిటికెడు పడగానే వంటిల్లంతా పరిమళాలను వెదజల్లి, నషాళానికి అంటేలా ఘుమఘుమలాడే ఎన్నో బ్రాండ్ల ముద్ద ఇంగువను సామాన్యుడు కళ్లు మూసుకుని నమ్మాడు. వివిధ బ్రాండ్లపై ఉన్నది కొండంత నమ్మకమైతే, అందులో ఉన్న నాణ్యత మాత్రం గోరంతేనని తేలడం దిగ్భ్రాంతికరం. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముడి ఇంగువ జాడ నామమాత్రమై, పరిమితికి మించిన పిండి పదార్థాలతో మార్కెట్లను ముంచెత్తుతున్నారన్న వార్త వినియోగదారుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కల్తీ కోరలు ఎంతవరకు విస్తరించాయో చెప్పడానికి దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థలపై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విధించిన విక్రయాల నిషేధమే ప్రత్యక్ష నిదర్శనం. విశ్వసనీయతకు మారుపేరైన లాల్జీ గోధు అండ్ కంపెనీ (LG), ఎవరెస్ట్ వంటి అగ్రశ్రేణి సంస్థల ఇంగువ నాణ్యతా లోపాలు బహిర్గతమవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సుగంధ మూలాలు… సుదూర తీరాలు
ఇంగువ భారతీయుల జీవనశైలితో, ఆహార సంస్కృతితో పెనవేసుకుపోయిన ఓ అమూల్య సుగంధ ద్రవ్యం. ఇది స్థానిక పంట కాదు. మధ్య ఆసియా దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల ఎడారి నేలల్లో పెరిగే ‘ఫెరులా’ మొక్కల వేర్ల నుంచి స్రవించే తెల్లటి జిగురు పాలు (రసిన్). గాలి తాకిడికి గడ్డకట్టే ఆ ముడి పదార్థాన్ని భారత్కు దిగుమతి చేసుకుని, వరి పిండి లేదా మైదాతో నిర్ణీత నిష్పత్తిలో సమ్మిళితం చేసి ‘కాంపౌండెడ్ ఇంగువ’గా విక్రయిస్తుంటారు.
ఉల్లి, వెల్లుల్లిని ఆహారంలో నివారించే ఎందరో భారతీయులకు ఘాటైన రుచిని భర్తీ చేసే ప్రత్యామ్నాయ సంజీవని ఇది. జీర్ణకారిగా ఆయుర్వేదంలో దీనికున్న ప్రాధాన్యం అపారం. ప్రపంచవ్యాప్తంగా ఇంగువ మార్కెట్ పరిమాణం 2026 నాటికి సుమారు ₹5,291 కోట్లకు (629.89 మిలియన్ డాలర్లు) చేరుతుందని అంచనా. ఇది ఏటా 4.12% వార్షిక వృద్ధి రేటుతో (CAGR) పెరుగుతూ 2035 నాటికి దాదాపు ₹7,600 కోట్లను (905.88 మిలియన్ డాలర్లు) తాకనుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి ముడి రసిన్ను దిగుమతి చేసుకుంటున్న భారత్, దానిని దేశీయంగా ప్రాసెస్ చేసి అమెరికా, యూకే, యూఏఈ సహా 50కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. కాగా, ఈ అంతర్జాతీయ మార్కెట్లో అత్యధికంగా 65 శాతం అమ్మకాలు పౌడర్ రూపంలోనే సాగుతున్నాయి. ప్రపంచ వినియోగంలో సుమారు 80 శాతం ఇంగువను ఒక్క భారతదేశమే వాడుతోంది.. అటువంటి జీవనామృతాన్ని కాసుల కక్కుర్తితో నకిలీల మాయాజాలంగా మార్చేయడం క్షమార్హం కాని నేరం.
ప్రమాణాలకు తిలోదకాలు… లాభాలకే ప్రాధాన్యం
విశ్వసనీయతకు ప్రతీకలుగా చెప్పుకొనే లాల్జీ గోధు అండ్ కంపెనీ (LG), ఎవరెస్ట్ వంటి అగ్రశ్రేణి సంస్థల యూనిట్లపై జరిగిన తనిఖీల్లో వెల్లడైన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. నిబంధనల ప్రకారం ముడి ఇంగువలో స్టార్చ్ (పిండి పదార్థం) ఒక శాతానికి మించి ఉండరాదు. కానీ, ప్రయోగశాల పరీక్షల్లో ఏకంగా 15 నుంచి 32 శాతం వరకు పిండి పదార్థం ఉన్నట్లు తేలడం ఆహార చట్టాలను యథేచ్ఛగా తుంగలో తొక్కడమే.
అసలైన ఔషధ గుణాలను, ఘాటును నిర్ధారించే ‘ఆల్కహాల్-కరిగే సారం’ శాతంలో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. అంటే వినియోగదారుడు ఇంగువ అనుకుని కొంటున్నది అసలైన ఔషధ సారాన్ని కాదు, అధిక ధర చెల్లించి పిండి ముద్దలను మాత్రమే! ఇది కేవలం నాణ్యతా లోపం కాదు, వినియోగదారుడి ఆరోగ్యంతో ఆడుకుంటున్న ప్రమాదకరమైన వ్యాపార జాడ్యం. తనిఖీలు ముమ్మరమైన వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారులు మార్కెట్లలోని సరుకును స్వాధీనం చేసుకోవడం మేల్కొలుపే అయినా, ఇలాంటి చర్యలు తాత్కాలిక సంచలనాలకే పరిమితం కాకూడదు.
నిఘా కొరవడితే నిలువు దోపిడీయే
బ్రాండ్ పేరు ఎంత పెద్దదైనా సరే, అది చట్టానికి అతీతం కాదు. ‘నమ్మకమే పెట్టుబడి’గా దశాబ్దాలుగా వర్ధిల్లిన సంస్థలు, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడం దారుణం. నాసిరకం సరుకును మార్కెట్ల నుంచి వెనక్కి పిలిపించాలని ఆదేశించడంతోనే నియంత్రణ సంస్థల బాధ్యత తీరిపోదు. కల్తీలకు కారకులైన బడా సంస్థలపై నిష్పక్షపాత విచారణ జరిపి, భారీ జరిమానాలతో పాటు కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినియోగదారుల్లో పెరుగుతుంది. ఆహార భద్రతా ప్రమాణాల తనిఖీలు కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, నిరంతర నిఘా నేత్రంగా పనిచేయాలి. అప్పుడే వంటింట్లో ఘుమఘుమలాడే చిటికెడు ఇంగువలో స్వచ్ఛత నిలుస్తుంది; సామాన్యుడి విశ్వాసానికి న్యాయం జరుగుతుంది.
